UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 6:00 PM
పెద్దాపురం: క్రీడారంగం ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక మహారాణి కళాశాలలో పెద్దాపురం నియోజకవర్గ ఏపి సిఎం కప్ 2018 క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడ విద్యార్థులు ఉత్సహంగా పాల్గొనాలని, ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాపోటీలు నిర్వహించి క్రీడాకారులను తయారుచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు క్రీడల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. మండల, నియోజకవర్గ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో క్రీడాపోటీలలో విద్యార్థులు రాణించాలని, క్రీడలవల్ల మానసిక ప్రశాంతతతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. పెద్దాపురంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. ఈ క్రీడాపోటీలలో నియోజకవర్గంలోని 14 పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు సుమారు 300 మంది పాల్గొంటున్నారని కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, హేండ్ బాల్, తదితర పోటీలు నిర్వహిస్తారని, ఈ పోటీలు కేవలం 14 నుంచి 17 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు నిధులు సమకూర్చి క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థులకు క్రీడలపట్ల ఆశక్తిని పెంపోందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి జాతీయజెండాను ఎగరవేసి కబడ్డీ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా ఆశాలతాపీటర్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఎంఇవో దుర్గాప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ వీరయ్యచౌదరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.వి.ఎస్. రంగారావు, మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కర్, కౌన్సిలర్ బేదంపూడి సత్తిబాబు, నియోజకవర్గంలోని 14 పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.







