--ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు కల్పించడం సరికాదు
--ఉద్యోగుల వయోపరిమితిపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
--రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు
UPDATED 30th JULY 2017 SUNDAY 7:00 PM
తుని: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కల్పించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడేదిలేదని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామ కృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆదివారం మాట్లాడారు. ఉద్యోగుల వయోపరిమితి పై ముసాయిదా జీవో తయారయ్యిందని ఉద్యోగుల్లోభయాందోళనలు రేకెత్తించేలా వార్తలు ప్రచురించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక పత్రిక, ఛానల్ పనిచేస్తున్నాయని, అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఉద్యోగుల వయోపరిమితిపై ముసాయిదా జీవో ఆర్ధిక శాఖ, న్యాయ శాఖ ఆమోదం పొందిందని ఈ జీవో పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్ధిక శాఖా మంత్రిగా తానుగాని, న్యాయ మంత్రిత్వ శాఖల్లో గాని ఈ జీవో కు సంబంధించి ఎటువంటి ఆమోదం ఇవ్వలేదన్నారు. కానీ జీవో ఇచ్చినట్లు ఓ పత్రికలో ప్రచురించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో ఇచ్చిఉంటే ఆ జీవో ను ప్రచురించాలన్నారు. ఉద్యోగుల్లో ఆందోళన కల్గించే ప్రయత్నాలు చేయడం తక్షణమే మానుకోవాలన్నారు. అలాగే కులాల మధ్య అపోహలు కల్గించేలా వార్తలు రాయడం, కులాల వివరాలు సేకరించే పనిని జస్టిస్ మనుజునాథ కమీషన్, వెనుకబడిన తరగతులలో ఇతర కులాలను చేర్చడానికి ప్రజాసాధికారత సర్వే కోసం కులాల వివరాలు సేకరించారన్నారు. పత్రికలో ప్రచురించిన వార్తపై ఇచ్చిన వివరణను వక్రీకరించడం కూడా పత్రికా విలువలకు వ్యతిరేకమని మంత్రి పేర్కొన్నారు. జీవో జారీ కోసం ఒక ప్రత్యేక విధానం ఉంటుందని తయారు చేసిన జీవో నోట్ ను సంబంధిత మంత్రి ఆమోదించవలసి ఉంటుందన్నారు. అలాగే రూల్స్ మార్చారని రాయడం పై ఆయన అభ్యంతరం చెప్పారు. చీఫ్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి వరకూ వెళ్లిన తరువాత కేబినెట్ ఆమోదం పొందాకా రూల్స్ మార్చడం జరుగుతుందన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. పత్రికల్లో వార్తలు ప్రచురించేటప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఇచ్చిన మార్గదర్శకాలను కూడా అనుసరించలేదని ఇతరుల పరువు, ప్రతిష్టలు తగ్గించేలా ఉండకూడదని, వార్తలను వివరణతో ప్రచురించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య నివేదికలు ప్రచురిస్తే వాటిని సీరియస్ గా పరిగణిస్తారని అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ను అతిక్రమించారన్నారు. వార్తలు సేకరణలో పరిశోధనాత్మకత ఉండవచ్చని అవి వాస్తవమై ఉండాలని యనమల సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, తాండవ సుగర్స్ చైర్మన్ సుర్ల లోవరాజు తదితరులు పాల్గొన్నారు.







