UPDATED 1st MAY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: కార్మికుల హక్కులు, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడేది, వారికి అండగా నిలిచేది ఎర్రజెండా అని కార్మిక నాయకులు అన్నారు. పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు పెదబ్రహ్మదేవం, మేడపాడు, కొత్తూరు, వేట్లపాలెం, హుస్సేన్ పురం గ్రామాల మీదుగా సామర్లకోట పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బళ్లమార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ అమెరికాలో జరిగిన పోలీసు కాల్పుల్లో నెలకొరిగిన ఎందరో కార్మిక సోదరుల రక్తం నుంచి పుట్టిందే ఈ ఎర్రజెండా అన్నారు. కార్మికుల పనిగంటల తగ్గింపు, వారికి రక్షణ చట్టాల ఏర్పాటు, సంక్షేమ పథకాల రూపకల్పనకు పోరాటం సాగుతుందన్నారు. సమాజంలోని అసమాతలను రూపుమాపేందుకు పోరు సాగుతుందన్నారు. పేదవాడి కష్టాన్ని కన్నీళ్లలో అర్థం చేసుకొని చేయూతనిచ్చేవాడే కమ్యూనిస్టన్నారు. ఒక్కసారి ఎర్రజెండాను ప్రేమిస్తే చనిపోయేవరకు ఆ ప్రేమపోదని చెప్పారు. గెలుపోటములు కమ్యూనిస్టుకు ముఖ్యం కాదని, పోరాటాలే ఊపిరన్నారు. పోరాటంలో గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మేడే సాక్షిగా కార్మికుల ఐక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాలం శ్రీనివాస్, హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు విపర్తి కొండలరావు, అంగన్వాడీ నాయకురాలు ఎన్. వరలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు కరణం ప్రసాదరావు, సిఐటియూ నాయకులు తుంపాల శ్రీనువాసు, నమ్మి భద్రరావు, కె. గోవిందు, కె. సత్యనారాయణ, బి. సత్తిబాబు, బత్తుల బాలాజీ, సయ్యపురెడ్డి యువరాజు, గోపాల్, మహేష్, వీరబాబు, ఉప్పలపాటి చంద్రశేఖర్, మొండెం సర్రయ్య, కలవల చిన్ని, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







