UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 6:00 PM
సామర్లకోట: వేదాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో సుమారు రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న శైవాగమ విద్యాపీఠం, శ్రీ ఆదిశైవ ద్రావిడ బ్రాహ్మణ సంక్షేమ భవనానికి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వేద పాఠశాలలను నిర్మించడం ద్వారా పురాతన వేదాలను కాపాడుకున్నవారమవుతామని, వేదాలను సాంప్రదాయాలను నేటితరం వారికి చేరేలా ఈ పాఠశాల ఉపయోగపడుతుందని అన్నారు. ఈ భవన నిర్మాణానికి ఎం.ఎల్.ఎ గ్రాంట్ రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిశైవ ద్రావిడ బ్రాహ్మణ సంక్షేమ సంఘం యూత్ ఈ వేద పాఠశాల ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదిశైవ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ యనమండ్ర సత్య సీతారామ శర్మ, కాకినాడ ఆదిశైవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం యూత్ ప్రెసిడెంట్ చంద్రమౌళి దుర్గా ప్రసాద్, సెక్రటరీ వెలవలపల్లి సోమేశ్వరశర్మ, సర్పంచ్ పోతల నాగమహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ పబ్బినీడి ఈశ్వరరావు, యూత్ సభ్యులు వెలవలపల్లి చినశర్మ, బాదంపూడి వెంకన్నబాబు, చంద్రమౌళి ఈశ్వరశర్మ, పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, పూజ్యం హరి నాగేశ్వరశర్మ, తదితరులు పాల్గొన్నారు.







