TTD: హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో మలయప్ప

Updated 19th September 2023 Tuesday 9.30 pm

Thirumala: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు మంగ‌ళ‌వారం రాత్రి  మలయప్పస్వామి హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి

హంస వాహనసేవలో మలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల  పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల  చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

హంసవాహన సేవలో కళావైభవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

ఇందులో వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నర్తన గణపతి కళారూపకం ఆకట్టుకుంది. అలాగే భృగుమహర్షి, శ్రీవారి రూపాలంకృతులతో తమిళనాడు బృందం భరతనాట్యం, శ్రీవారే దేవాది దేవుడుగా భావిస్తూ ఆడుతూ పాడుతూ చేసే తమిళనాడు పెరుమాళ్ నృత్యం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో విశేష ప్రాచుర్యంలో ఉన్న కాళీయట్టంతో కాళీయమర్ధనం, మోహినీ నృత్యం అలరించాయి. వీటితో పాటు తమిళనాడుకు చెందిన నెమలి నృత్యం, పాండిచ్చేరికి చెందిన కట్టెలపై నడుస్తూ, వృషభ పులివేషాలతో కూడిన కరకట్టం, కుత్రాల కురవంజి అనే నృత్యాలు, గోపికా వేషధారణలతో కూడిన మణిపూర్ నృత్యం, తమిళనాడు నుండి వచ్చిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి దాదాపు 300 మంది కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ఈ వాహనసేవలోని కళా ప్రదర్శనలను టీటీడీ జెఈఓ సదా భార్గవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us