అచ్చమైన తెలుగుతనానికి కృష్ణశాస్త్రి కవిత్వం ప్రతీక

* శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
* ఘనంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి వేడుకలు

UPDATED 1st NOVEMBER 2018 THURSDAY 6:30 PM

సామర్లకోట: భావ కవితా మాధుర్యంతో తెలుగు సాహిత్యానికి క్రొత్త సొబగులు అద్దిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. భావకవితా చక్రవర్తి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 122వ జయంతి వేడుకలను ఆయన స్వగ్రామం సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రమణ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. తొలుత దేవులపల్లి కృష్ణశాస్త్రి నివసించిన ఇంటి ఆవరణలో గల ఆయన విగ్రహానికి అతిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభాకార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసనసభ ఉపసభాపతి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి వెంకట కృష్ణారావు, దేవులపల్లి అత్యంత సన్నిహితులని, తద్వారా ఆయన ఆత్మీయను, ఆశీస్సులను పొందే అదృష్టం తనకు లభించిందని అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, తెలుగుజాతికి వన్నెతెచ్చారని, అటువంటి వారిలో కృష్ణ శాస్త్రి ముందు వరుసలో నిలుస్తారన్నారు. అచ్చమైన తెలుగుతనానికి కృష్ణశాస్త్రి కవిత్వం ప్రతీకని, పల్లె జీవన సౌందర్యాన్ని, సంస్కృతిని ఆయన వ్యాసాలు, పాటలు ప్రతిబింబిస్తాయని అన్నారు. సాహితీరంగంలోనే కాక, హరిజనోద్దరణ, వేశ్యా వివాహాలు వంటి సామాజిక ఉద్యమాలలో కూడా కృషి చేసిన మహనీయుడన్నారు. భాషా లాలిత్యం, భావ సౌందర్యంతో తెలుగు సాహిత్యానికి వైభవాన్ని తెచ్చిన దేవులపల్లిని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ ఆంధ్రా ఠాగూర్ అని, శ్రీశ్రీ చేత ఆంధ్రా షెల్లీ అని కొనియాడరని తెలిపారు. మహనీయుల వల్ల వారు పుట్టిన గడ్డకు ఖ్యాతి వస్తుందని, దేవులపల్లి జన్మించిన చంద్రంపాలెం సాహితీ ప్రపంచానికి ఆత్మీయ గ్రామమన్నారు. ఆయన ఆశయాల బాటలో కృషి చేస్తున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ ను, స్థానిక ఎమ్మెల్యేగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్పను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతి వైభవం, ఖ్యాతి తెచ్చిన వైతాళికుల జయంతులను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం నిర్వహిస్తోందని, కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు జయంతుల రీతిలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతిని కూడా రాష్ట్ర వేడుకగా ప్రకటించేందుకు, ఆయన పేర సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాన్ని కోరతామన్నారు. అలాగే చంద్రంపాలెంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి జీవిత విశేషాలు, సాహితీ, సామాజిక రంగాలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. కృష్ణశాస్త్రి జన్మించిన చంద్రంపాలెం తెలుగు వారికి పవిత్ర క్షేత్రమన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కృష్ణశాస్త్రి సృతులను, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామ యువత చేస్తున్న కృషిని అభినందిస్తూ గ్రామాభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో కృష్ణశాస్త్రి స్మారక భవనాన్ని త్వరలోనే చేపడతామని తెలియజేశారు. ఈ సభలో కవులు డాక్టర్ శిఖామణి, సాలిపల్లి మంగమణి, పుప్పాల సూర్యకుమారి దేవులపల్లి సాహిత్యం గొప్పదనాన్ని సభికులకు వివరించారు. దేవులపల్లి జయంతి పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. బెంగుళురులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న గ్రామ యువకుడు తలారి వెంకట వీర్రాజు దేవులపల్లి చారిటబుల్ ట్రస్ట్ కు అందజేసిన లక్ష రూపాయల విరాళాన్ని ఆయన తండ్రి భావనారాయణ మంత్రి చేతుల మీదుగా ట్రస్ట్ కు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, సోషల్ వర్కర్లు గోకాడ రాంబాబు, ఉంగరాల వెంకటేశ్వరావు, బచ్చు ఫౌండేషన్ చైర్మన్ ఎ. కృష్ణ, అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, దేవులపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాపారావు, సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us