UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 6:00 PM
పెద్దాపురం: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక 27వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో 84వ నెంబరు అంగన్వాడీ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సురిబాబురాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ఎన్టీఆర్ కాలనీ పట్టణానికి దూరంగా ఉండటం వల్ల కాలనీ వాసులు వ్యయప్రయాసాలకు లోను కాకుండా కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, త్వరలో నూతన భవనానికి స్థలాన్ని కేటాయించి నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ కాలనీలో రేషన్ దుకాణం, పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. గర్భణీ స్త్రీలకు పోషకాహారం అందించడమే కాకుండా వారికి ఉచితంగా వైద్యపరీక్షలు, డెలివరీ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా ఉచిత రవాణా సదుపాయం అందచేస్తున్నామని చెప్పారు. కాలనీకి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ ఈ కాలనీలో సుమారు మూడు వేల మంది నివాసం వుంటున్నారని, వీరికి అవసరమైన త్రాగునీరు, విద్యుత్, పాఠశాల భవనాలు, తదితర అవసరాలను మంత్రి తీరుస్తున్నారని తెలిపారు. ప్రజలు సహకారంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ బి. ఆర్. శేషాద్రి, 27వ వార్డు కౌన్సిలర్ కుండల హరిబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, సిడిపివో టి.ఎస్.ఆర్. పద్మావతి, కౌన్సిలర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







