Updated 1st Januarh 2023 Sunday 10:10 pm
Stampede At Chandrababu Meeting : నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.
చీరలు, తోఫా పంపిణీ కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. చీరల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడ్డారు. బ్యారికేడ్లు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక తీవ్రంగా గాయపడ్డ నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. స్పాట్ లోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను రమాదేవి, ఆషియా గుర్తించారు.
న్యూ ఇయర్ వేళ టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30వేల మందికి చీరల పంపిణీని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.
దీని కోసం గత పది రోజులుగా స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో న్యూ ఇయర్ కానుక తీసుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.







