Updated 8th April 2023 Saturday 3:15 pm
PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని.. దీంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు.
రైల్వేలతోపాటు జాతీయ రహదారులకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కల్వకుర్తి-కొల్లాపూర్ జాతీయ రహదారి, మహబూబ్ నగర్-చెంచోరీ రహదారి, తెలంగాణలో రహదారులకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంతకముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదిక నుంచే ప్రధాని మోదీ వర్చువల్ గా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించారు. రూ.11 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, రూ.1365.95 కోట్లతో ఎయిమ్స్ 750 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు.







