విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, ఓ యువతి సముద్రంలో స్నానానికి దిగారు. పెద్ద అలలు లోపలికి నెట్టేయడంతో ఐదుగురు గల్లంతయ్యారు. ఘటన జరిగిన అరగంటలోనే యువతి, యువకుడి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ముగ్గురి కోసం గజ ఈతగాళ్లు, లైఫ్ గార్డ్స్ గాలింపు చేపట్టారు. విహారయాత్ర కోసం విశాఖ వచ్చిన వీరంతా సముద్రంలో స్నానానికి దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్ సిబ్బందికి సమాచారం అందజేశారు. గల్లంతైన వారి కోసం స్పీడ్ బోట్లు, హెలికాప్టర్ ద్వారా గాలించే అవకాశం ఉంది. ఒడ్డుకు వచ్చిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.







