UPDATED 29th AUGUST 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: కృషి, పట్టుదల, సమయపాలనతో ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చని ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత సయ్యద్ మహమ్మద్ ఆరీఫ్ అన్నారు. స్థానిక రామారావుపేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాంత్రికుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాకీని జాతీయ క్రీడగా గుర్తింపు తెచ్చిన హాకీ మాంత్రికుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ధ్యాన్ చంద్ పట్టుదల, దీక్ష, ఒలింపిక్ విజయాల పరంపరను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయప్రకాష్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జీవితం మనకు ఆదర్శం కావాలని, ఏ వసతులు లేని రోజులలో ఆయన సాధించిన విజయాలను మనకు స్ఫూర్తినివ్వాలన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ సేవలు దేశ క్రీడారంగానికి అవసరమని, ఎందరో ఒలెంపిక్ క్రీడాకారులకు ఆయన గురువు కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడా శిక్షకుడు, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల క్రీడా పర్యవేక్షకులు వి.ఆర్. ముక్కామల, సీనియర్ ప్రిన్సిపాల్ యం.వి.వి.ఎస్. మూర్తి, సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ కె. నీరాప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







