హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని స్పష్టం చేసింది. అయితే చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులకు సహాయపడవచ్చు. హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనులకు వినియోగించరాదని స్పష్టం చేసింది.







