Updated 5th June 2023 Monday 7:10 pm
Nadendla Manohar – Pawan Kalyan: జనసేన (Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్‌ను ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గుంటూరులో విడుదల చేశారు. జూన్ 14 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం తరువాత కత్తిపూడి నుంచి పవన్ యాత్ర ప్రారంభం అవుతుంది. భీమవరంతో కలిపి 11 నియోజక వర్గాల్లో యాత్ర నిర్వహిస్తామని నాదెండ్ల చెప్పారు.
పవన్ కల్యాణ్ పర్యటనలో ప్రతి జనసేన కార్యకర్త, నాయకులు పాల్గొనాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. జన వాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. 2వ విడతలో భాగంగానే జనవాణి కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారం చూపడానికి భరోసా కల్పించడానికి పవన్ కల్యాణ్ వస్తున్నారని చెప్పారు.
వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పబోతున్నారని, జగనన్న పాపపు పథకాలను ప్రజలకు చేరవేస్తూ పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండాలని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజక్ట్ గా కేంద్రం ప్రకటించిన నాటినుండి నేటివరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని నాదెండ్ల మనోహర్ అడిగారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ విషయంలో స్పష్టత ఇవ్వాలని, రేటినింగ్ వాల్ ఎందుకు దెబ్బతిందో ప్రజలకు చెప్పాలని కోరారు. 2021లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారని నిలదీశారు.







