Updated 1st May 2017 Monday 11:30 AM
కాకినాడ : ప్రజావాణికి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా న్యూ లుక్ తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిని గాడిలో పెట్టడానికి జిల్లా కలెక్టర్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ కలెక్టరేట్ వెనుక భాగంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూనే వినతులు అందచేసేవారు. దీంతో కలెక్టర్ ప్రజావాణి స్వరూపాన్ని పూర్తిగా మార్పుచేయటానికి చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఆయనతో పాటు కీలకమైన ప్రభుత్వ శాఖల అధికారులు వినతులు స్వీకరించారు. ప్రతీ పది మంది అర్జీదారులను కోర్టు హాల్లోకి అనుమతించారు. మిగతా వారు కోర్టు హాలు వెలుపల వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. అర్జీలను పరిశీలించిన తరువాత వాటికి రసీదులు ఇవ్వటానికి కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత నేపథ్యంలో కోర్టు హాల్లో ఏసీ యంత్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులు కలెక్టరేట్ కోర్టు హాలు వద్దకు మెట్లు ఎక్కి రావాల్సిన పనిలేకుండా కింద భాగంలో ఒక గదిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ నందిని , జిల్లా జాయింట్ కలెక్టర్-2, జె. రాధాకృష్ణమూర్తి, ఇన్ ఛార్జ్ డిఆర్ఓ ఎం.జ్యోతి, డిఆర్ డి ఏ పిడి మల్లిబాబు, డ్వామా పిడి నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈవో కె. పద్మ తదితరులు హాజరయ్యారు.







