★ వైసీపీ నాయకుడి అండతోనే జరుగుతోందంటూ గ్రామస్థుల ఆరోపణ
ద్రాక్షారామ (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 32022 : చౌక దుకాణాల్లోని నిత్యావసరాలను ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా ఇటీవల ప్రభుత్వం ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసింది. వాహనదారుడికి రూ.18 వేలు, సహాయకుడికి కొంత వేతనం ఇస్తున్నారు. అది సరిపోవట్లేదన్నట్లు పండుగ మామూళ్ల పేరుతో డబ్బాకు స్టిక్కర్ అంటించి దందాకు దిగారు రామచంద్రపురం మండలం వెల్ల గ్రామ ఎండీయూ ఖండవిల్లి శివ. ఇదేమని ప్రశ్నిస్తే వైకాపా నాయకుల పేర్లు చెప్పి బెదిరింపుకు దిగుతున్నాడని గ్రామస్ధులు వాపోతున్నారు. అతడు డీసీఎంఎస్ డైరెక్టరు గణపతి మేనల్లుడు.. ఈ గ్రామం బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాకృష్ణ నియోజకవర్గం పరిధిలోనిది కావడంతో చర్చనీయాంశంగా మారింది. స్థానిక జనసేన నాయకులు వీడియోలు తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టారు. ఇదే విషయమై బుధవారం గ్రామ సభలో ప్రస్తావించగా సర్పంచి వీరబోయిన సూరిబాబు, పంచాయతీ అధికారులు అతన్ని గ్రామ సభకు పిలిపించారు. తహసీల్దారు తీసుకోమన్నారని కొంతసేపు.. సహాయకుడి కోసం అడిగామని కొంతసేపు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఎండీయూ శివను విధుల నుంచి తొలగించాలని మంత్రి వేణు ఆదేశించినట్లు తహసీల్దారు తేజేశ్వరరావు తెలిపారు.







