UPDATED 19th JUNE 2017 MONDAY 7:00 PM
గండేపల్లి: అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యమని సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నీక్ విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సంస్థ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు అభ్యసించిన విద్యా విధానానికి, ఈ పాలిటెక్నీక్ విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని, విద్యార్థులు ఇంటర్నెట్ ను వీడి పుస్తక పఠనం అలవరచుకుంటే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందన్నారు. కష్టించి చదివి నేర్చుకున్నదాని పైనే మీ జీవితం ఆధారపడి ఉంటుందని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను కళాశాలలో చేర్పించడంతోనే తల్లి దండ్రుల పాత్ర పూర్తి కాదని, యాజమాన్యంతో సహకరించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయవచ్చని సూచించారు. విద్యార్థులకు ప్లేసెమెంట్ ట్రైనింగ్ ల్యాబ్, లేబరేటరీ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సంస్థ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో కూడిన విద్యావిధానానికి ఆదిత్యకు సాటి మారేదీ లేదన్నారు. నిరంతరం శ్రమిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే మెరుగైన కళాశాలగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అలాగే ఈసెట్ లో వందలోపు 31 ర్యాంకులు సాధించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా 32 కళాశాలలకు గానూ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన 27 ప్రతిభ పురస్కారాలలో 19 పురస్కారాలను ఆదిత్య కైవసం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ కుమార్, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.







