Updated 3rd May 2017 Wednesday 10:00 AM
ద్వారకాతిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి చేసుకునే వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేసేందుకు ఆలయ అధికారులు సంసిద్ధులయ్యారు. దీనిలో భాగంగా శ్రీవారి ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. నాలుగు వైపులా ఉన్న గోపురాలను సుందరీకరించారు. వీటిని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. విద్యుద్దీపకాంతులతో స్వామి, అమ్మవార్ల రూపాలు దర్శనమిచ్చేలా ఆలయ పరిసరాల్లో పలుచోట్ల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పాదుక మండపం ఎదురుగా, గరుత్మంతుని విగ్రహం వద్ద కల్యాణ మహోత్సవాలకు స్వాగతం పలికే రీతిగా భారీ కటౌట్లను పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజుకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 8 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.







