* రూ.మూడు కోట్ల వ్యయంతో 30 పడకల ఆసుపత్రి
* వైద్యుల భర్తీకి చర్యలు
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప
UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.52 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహారి గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలను పంపడం జరిగిందని, సుమారు 70 వేల జనాభా కలిగిన సామర్లకోట పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అవసరం ఎంతైనా ఉందని, అలాగే ఆసుపత్రి అభివృద్ధికి ఎన్నారైల సహాకారం కొరతామన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని, రాత్రి సమయంలో కూడా అందుబాటులో వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసుతో ఫొన్లో మాట్లాడారు. ఆసుపత్రి వైద్య సేవలను మెరుగుపరచాలని ఆయన మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అడబాల కుమార స్వామి, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, సామర్లకోట పట్టణ మున్సిపల్ వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, మన్యం చంద్రరావు, డీసీహెచ్ ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ చెంచయ్య, ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ చంద్రరావు, లక్ష్మీ, ఏపీఎంఐడిసి ఏఈ కేశవరావు, ఏఈఈ రత్నరాజు, తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డి.ఎం.హెచ్.వోపై హోంమంత్రి ఆగ్రహం
డీఎంహెచ్ఓ చెంచయ్య పై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సత్వర చర్యలు చేపట్టడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది రోగులను సమీపంలో ఉన్న పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళమని చెప్పడం ఏంటని నిలదీశారు. ప్రజల అవసరాలను తీర్చడంలో మీరు విఫలం అవుతున్నారని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్షణమే ఆసుపత్రి కి కావాల్సిన వైద్యులను నియమించాలని ఆదేశించారు. అలాగే ఈ విషయంపై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేనీ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడారు. విధి నిర్వహణలో అలసత్వంగా ఉండే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.







