మాచర్ల (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మాచర్ల గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గురజాల డీఎస్పీ మెహర్‌ప్రసాద్, గ్రామీణ, పట్టణ సీఐలు సురేంద్రబాబు, సుబ్బారావుతో కలసి విలేకర్లతో మాటాడుతూ వివరాలు వెల్లడించారు. గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు వచ్చిన సమాచారంతో 6న తెల్లవారుజామున నాగార్జున సాగర్ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద గ్రామీణ సీఐ సురేంద్రబాబు, ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో రెండు వాహనాల్లోని వారు హైదరాబాద్ నుంచి మాచర్ల వైపు వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిప్పుకొని వెళ్లిపోతున్నారు. వారిని వెంబడించి వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. అందులో చేపల మేతకు వేసే బస్తాల కింద 78 ఎర్రచందనం దుంగలు, రెండో వాహనంలో పొట్టు బస్తాల కింద 133 దుంగలు మొత్తం కలిపి 211 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. ఆ రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, ఎర్రచందనం మొత్తం విలువ రూ.37 లక్షల వరకు ఉంటుంది. నిందితులు అట్ల తిరుమలరెడ్డి, యార్లగడ్డ చిరంజీవి, దుండి వాసిరెడ్డి, ఎస్‌కే షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించడంతో పాటు నగదు రివార్డు అందించారు. సమావేశంలో ఎస్సైలు అనిల్‌కుమార్‌రెడ్డి, పాల్ రవీందర్ పాల్గొన్నారు.







