UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 7:10 PM
Minister Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గంలో మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. దీంతో జెడ్పీటీసీపై దాడికి యత్నించారు రోజా అనుచరులు. సచివాలయ భవనం తాళాలు పగలకొట్టి బలవంతంగా భవనం తెరిచారు రోజా అనుచరులు.
సచివాలయ నిర్మాణ ఖర్చులు రూ.25లక్షలు పెండింగ్ లో ఉన్నాయని, నిధులు మంజూరు చేయకుండా భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. అయితే, సచివాలయ భవనానికి తాళం వేసిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. బెదిరించి బిల్లులు తీసుకుని మంజూరు కాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. అన్యాయం చేశారని చెప్పడం బాధాకరం అన్నారు రోజా.
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే తరచూ నిరసనలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలు ఆమెకు తలనొప్పిగా మారారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మంత్రి రోజా ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా పని చేయడం కరెక్ట్ కాదన్నారు. తాజాగా తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి రోజా వెళ్లగా.. వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మంత్రి రోజా పర్యటనపై అభ్యంతరం తెలిపారు.
ఒకే ప్రాంగణంలో సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రాన్ని రూ.34 లక్షలు వ్యయంతో నిర్మించామని మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్మాణ ఖర్చుల్లో ఇంకా రూ.23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగానే మంత్రి రోజా హడావుడిగా ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే భవనాలను ప్రారంభించాలని తాళాలు వేశారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మురళీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.







