UPDATED 24th JULY 2017 MONDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సర్ ఆర్ధర్ కాటన్ 118 వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషా రెడ్డి హాజరయ్యారు. ముందుగా కళాశాల క్యాంపస్ లో ఉన్నకాటన్ మహాశయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశాల్లో పుట్టినప్పటికీ మనకోసం అవతరించిన మహోన్నత వ్యక్తిగా ఇక్కడి ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పచ్చని పంట పొలాలతో మన ప్రాంతం అంతా సస్య శ్యామలంగా మారడానికి కాటన్ మహాశయుడు చేసిన కృషిని ఆయన కీర్తించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఆర్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







