Crime News: ప్రేమించలేదని నరికేశాడు

UPDATED 9th OCTBER 2022 SUNDAY 05:00 AM

కాకినాడ జిల్లా పెదపూడిలో ఘాతుకం

వేధింపులపై ఫిర్యాదు చేసిందని పగ

యాసిడ్‌ లేదా కత్తితో హత్యకు పథకం

స్కూటీపై వెళుతుండగా ఆపి.. నరికివేత

ఆస్పత్రికి చేర్చేలోపే యువతి మృతి

నిందితుడిని చితక్కొట్టిన ఊరి జనం

Crime News : ప్రేమించలేదని, పెళ్లికి అంగీకరించలేదని పగబట్టాడు. తొలుత యాసిడ్‌ దాడి.. తప్పించుకుంటే కత్తి దూయాలని పథకం పన్నాడు. మాటు వేసి పైకి దూకి పీక కోసేశాడు. అప్పటికీ కసి తీరక ఉన్మాదంతో రెచ్చిపోయాడు. రక్తపుమడుపులో తన్నుకుంటున్న ఆమెను కాళ్లతో తొక్కిపట్టి పదేపదే నరికాడు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో శనివారం ఈ ఘోరం జరిగింది. హత్య చేసిన తర్వాత కూడా అక్కడే ఉన్న ఆ ఉన్మాదిని జనం పట్టుకుని చెట్టుకు కట్టి చితగ్గొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోనసీమ జిల్లా కె.గంగవరం మండలానికి చెందినకాదా దేవిక (22).. కరప మండలం కూరాడ గ్రామంలోని అమ్మమ్మ కొప్పిశెట్టి చంద్రమ్మ వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంటున్నారు. దేవిక తల్లిదండ్రులు నాగమణి, రాంబాబు పని వెతుక్కుంటూ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఆమె తండ్రి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు.

దేవిక సోదరి బీటెక్‌ చదువుతోంది. రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ (26).. దేవికను కొన్నేళ్లుగా ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తున్నాడు. అతడుకూడా కూరాడలోనే అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. అతని ప్రేమ ప్రతిపాదనను ఆమె ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఇంట్లో పరిస్థితులు బాగోలేవని, తనను వదిలేయాలని కోరింది. కానీ సూర్యనారాయణ మాత్రం వెంటపడడం మానలేదు. అతడి పోరు భరించలేక కొన్ని నెలల కిందట దేవిక కుటుంబ సభ్యులకు విషయం వివరించింది. వారు గ్రామపెద్దలను ఆశ్రయించారు. పెద్దలు రెండు కుటుంబాలను పిలిపించి... సూర్యనారాయణను హెచ్చరించారు.

ఆ తర్వాత స్వస్థలం బాలవరానికి సూర్యనారాయణను అతని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. దీంతో దేవికపై సూర్యనారాయణ పగ పెంచుకున్నాడు. మరోవైపు దేవికను ఆమె అమ్మమ్మ హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు పంపించింది. వివాదం సద్దుమణిగినట్టేనని భావించి.... కొద్దిరోజుల క్రితమే దేవిక తిరిగి అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. మాటు వేసి.. మట్టుపెట్టి...దేవిక తిరిగి వచ్చిందన్న సమాచారం సూర్యనారాయణ తెలుసుకున్నాడు. పగతో రగిలిపోతున్న అతడు.. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. యాసిడ్‌ పోసి చంపేయాలని పథకం పన్నాడు. ఆ దాడినుంచి తప్పించుకుంటే కత్తితో నరికి చంపాలని ఆలోచించాడు. యాసిడ్‌ సీసా, కత్తిని బ్యాగులో ఉంచుకుని మాటువేశాడు.

దేవిక శనివారం ఉదయం యాక్టీవా స్కూటర్‌పై కరపలోని వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లి... తిరిగి కూరాడకు బయలుదేరింది. దారిలో మాటువేసిన సూర్యనారాయణ బండిపై వెళ్తున్న దేవికను కాండ్రేగులవద్ద అడ్డుకున్నాడు. తన ప్రేమను ఆమోదించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఈ రోజు ఏదొకటి తేలిపోవాలని హెచ్చరించాడు. బెదిరిపోయిన దేవిక తాను ప్రేమించడం లేదని, తనకు అటువంటి ఉద్దేశాలు లేవని, వదిలిపెట్టాలని ఏడుస్తూ వేడుకుంది. వీరిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో సూర్యనారాయణ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ నుంచి కత్తి తీసి దేవిక మెడపై విచక్షణారహితంగా వేటువేశాడు. ఆమెను కాలితో తొక్కిపట్టి కత్తితో అనేకసార్లు మెడ, తల, చేతులపై నరికేశాడు. ఇంతలో సమీపంలో ఉన్న రైతులు పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది.

రౌడీషీట్‌ తెరుస్తాం:

కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ‘‘కరప నుంచి కూరాడకు దేవిక వెళ్తుండగా దారి కాచి సూర్యనారాయణ కొడవలితో నరికి చంపాడు. వారిద్దరికీ ఏడేళ్లుగా పరిచయం ఉంది. దేవిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటారు. నిందితుడు మేనమామ ఇంటి దగ్గర ఉన్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నాలుగేళ్ల క్రితం వరకు సాగింది. పెళ్లి ప్రతిపాదనను అప్పట్లో అబ్బాయి తల్లిదండ్రులు నిరాకరించారు. రెండు నెలల క్రితం అబ్బాయి ప్రేమ ప్రతిపాదనతో రాగా... అమ్మాయి తిరస్కరించింది. మరొకరితో సన్నిహితంగా ఉండటంవల్లనే తన ప్రేమను తిరస్కరిస్తోందని కక్ష పెంచుకున్నాడు. హత్యచేశాడు. ఏడు రోజుల్లో ఫాస్ట్‌ట్రాక్‌లో కేసు దర్యాప్తుచేసి చార్జిషీట్‌ వేస్తాం. అతనిపై రౌడీషీట్‌ ఓపెన్‌చేసి బెయిల్‌ రాకుండా చూస్తాం’’ అని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు.

కాగా, దేవిక కుటుంబసభ్యులను ఎంపీ వంగా గీతతో కలిసి కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. దేవిక హత్యోదంతం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us