గిరిజనుల సంక్షేమానికి సహకారం అందించాలి

* ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 15th JUNE 2020 MONDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు తమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వపరంగా వారి సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించి తమ వంతు సహకారం అందించాలని సబ్-కలెక్టరు, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన ప్రాంత స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం అర్హత గల గిరిజనులకు మూడవ విడతలో వ్యక్తిగత పట్టాలు, ఉమ్మడి అటవీ వనరుల నిర్వహణ హక్కులు కల్పనకు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ సమాచారాన్ని గ్రామ సభలు, గ్రామ సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అటవీ హక్కులు గుర్తింపు పట్టాలు పొందిన గిరిజనులకు నరేగా పథకంలో ఏడాదికి 150 పనిదినాలు పొందే వెసులుబాటు ఉందని, రైతు గరిష్టంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన సాగుకు, మొదటి మూడు సంవత్సరాలు మొక్కల పెంపకానికి అవకాశం ఉందన్నారు. సేవా సంస్థలు తమ సేవా కార్యక్రమాలుతో పాటు ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలపై కూడా అవగాహన కల్పించి, వాటి ద్వారా వారి జీవనోపాధి పెంపుదల, ఆరోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన కోరారు. అనంతరం పలు విషయాలపై ఆయన చర్చించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టిఏ కృష్ణారావు, ఆదివాసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు కె. వెంకన్నదొర, ఆదివాసీ లీగల్ అడ్వైజర్ ఐ. సూర్యనారాయణ, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు కె. ప్రసాద్, మున్నేశ్వరరావు, చిన్నారావు, చిన్నారెడ్డి, వందన్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us