దిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నెట్టింట్లో సరదా పోస్టులు పెడుతుంటారు. చమత్కారంగా స్పందిస్తూనే.. సందేశం ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు అలాంటిదే. తమ చిన్నప్పుడు పిల్లలు అతి గారాలు పోకుండా క్రమశిక్షణతో ఉండేలా తల్లిదండ్రులు ఎలా సరిదిద్దేవారో వివరించారు. ‘నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు నన్ను సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లలేదు. మా అమ్మ ఒక్క దెబ్బతో నన్ను సరిచేసింది. నా జ్ఞాననేత్రం తెరిపించింది. నా పనులు, ఆలోచనలను అన్నింటినీ మార్చివేసింది’ అని అర్థం వచ్చేలా ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. అలాగే ఒక దెబ్బతో తనలాగే కుదురుకున్న వాళ్లెవరో చెయ్యి ఎత్తాలంటూ నెటిజన్లను అడిగారు. ‘అమ్మా.. ఐ లవ్యూ’ అంటూ తన తల్లిపై ప్రేమను కురిపించారు. ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ‘మా అమ్మ ఇప్పటికీ ఇలా చేస్తుంది’, ‘అలా నాకు చాలా సార్లు జరిగింది’ అంటూ పలువురు కామెంట్ చేశారు. అందుకే ఇప్పటివాళ్లతో పోల్చుకుంటే.. మనప్పటి పిల్లలకు మర్యాద, క్రమశిక్షణ ఎక్కువగా తెలుసని ఓ నెటిజన్ అనగా.. స్మృతి ఏకీభవించారు. బాటా చెప్పులతో నా తిక్క కుదిరిందని ఒకరు అనగా.. తనక్కూడా ఆ అనుభవం ఉన్నట్లు మంత్రి అన్నారు.







