UPDATED 21st AUGUST 2018 TUESDAY 6:00 PM
సామర్లకోట: దళారీల ప్రమేయం లేకుండా రైతులకు కల్పిస్తున్న మద్దతు ధర పూర్తిగా పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతి ద్వారా చేపట్టిన కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం ఇ.ఎన్. జయరాములు తెలిపారు. స్థానిక టిటిడిసిలో పెద్దాపురం డివిజన్ పరిధిలోని 12 మండలాలకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిబ్బందికి 2018-19 ఖరీఫ్ కు సంబంధించి మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై డిఎం జయరాములు పాల్గొని మాట్లాడుతూ రాబోయే 2018-19 ఖరీఫ్ కు డివిజన్ లో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వినూత్న పద్దతిలో తీసుకున్న నిర్ణయాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతుకు కల్పిస్తున్న కనీస మద్దతు ధర పొందడానికి, మధ్యవర్తులను సమూలంగా తొలగించడానికి ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ధారించిన సాధారణ వరి రకానికి క్వింటాలకు రూ.1750 , గ్రేడ్-ఎ రకానికి క్వింటాలుకు రూ.1770 కనీస మద్దతు ధర కల్పించిందని చెప్పారు. ఈ నిర్ణయాల్లో భాగంగా కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఆఫీసర్ యు.కె. మిశ్రా, టిసిఎస్ ప్రాజెక్టు అధికారి శర్మ, ఓ.ఎస్.డి ఇ. ప్రభాకరరావు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో శాంపుల్ సేకరణ, విశ్లేషణపద్దతి, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, శాంపుల్ కుదింపు పద్ధతి, కాల్ సెంటర్, గోనెసంచులు, రవాణా వివరాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సభ్యుల బాధ్యతలు, కేంద్రంలో పాటించవలసిన సూత్రాలు, టి- ఆపరేటింగ్, కేంద్రాలకు చేరవేసిన రైతులకు నేరుగా వారి ఖాతాలకు సొమ్మును జమచేసే పద్దతి, కోనుగోలు కేంద్రాల పర్యవేక్షణ, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతిలో ఏ.ఎస్.వో పురుషోత్తమకుమార్ మాట్లాడుతూ డివిజన్లో 12 మండలాల్లో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 12 వెలుగు గ్రామ సంఘాలు ద్వారా, 38 సహకార పరపతి సంఘాలు ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ఎం.ఎస్.వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఆపరేటర్లు, కేంద్ర నిర్వహణ సభ్యులు, వెలుగు సభ్యులు, ఏ.పి.వోలు, తదితరులు పాల్గొన్నారు.







