UPDATED 6th JULY 2026 8:00 PM
వ్యవసాయ యంత్రం చాటున ' గంజాయి' గుట్టురట్టు!
₹28 లక్షల విలువైన సొత్తు సీజ్..
అంతర్రాష్ట్ర ముఠా గుట్టు విప్పిన పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 6: రైతన్నలు వాడే వ్యవసాయ యంత్రాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసుల కళ్లు గప్పి భారీ ఎత్తున సాగిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు కిర్లంపూడి పోలీసులు. ఏకంగా ₹28.87 లక్షల విలువైన గంజాయి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, ఒకరిని కటకటాల వెనక్కి నెట్టారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఏబీజీ తిలక్ ఈ సంచలన కేసు వివరాలను వెల్లడించారు.
🦅 'ఈగిల్ టీమ్' స్కెచ్.. చెక్ పోస్ట్ వద్ద దొరికిపోయాడు!
జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా గంజాయి, అక్రమ రవాణాపై పోలీసులు డేగ కన్ను పెట్టారు. ఈ క్రమంలో జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు పర్యవేక్షణలో, కిర్లంపూడి ఎస్ఐ జె. సతీష్ తన సిబ్బంది మరియు స్పెషల్ ఈగిల్ టీమ్'తో కలిసి బూరుగుపూడి గ్రామ శివారు జాతీయ రహదారిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో అటుగా వస్తున్న ఒక ఆకుపచ్చ రంగు ట్రాక్టర్‌ను ఆపి సోదా చేశారు. పైకి అంతా మామూలుగానే ఉన్నా, ట్రాక్టరుకు అమర్చిన 'బుల్లాగ్రో' అనే వ్యవసాయ యంత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందులో అత్యంత రహస్య అరలను ఏర్పాటు చేసి దాచిన 25 గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు.
కేసు హైలైట్స్:
- పట్టుబడిన గంజాయి బరువు: 52.7 కిలోలు
- గంజాయి మార్కెట్ విలువ: సుమారు ₹26.35 లక్షలు
- మొత్తం సీజ్ చేసిన సొత్తు విలువ: ₹28,87,250/- (ట్రాక్టర్, బుల్లాఆగ్రో యంత్రం, కీప్యాడ్ మొబైల్, నగదుతో కలిపి)
- అరెస్ట్ అయిన నిందితుడు: కూచిపూడి ఫ్రాన్సిస్ (కట్టుబడిపాలెం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా).
ఏజెన్సీ టు అదర్ స్టేట్స్.. ఇదీ ప్లాన్!
నిందితుడు ఫ్రాన్సిస్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏజెన్సీ పరిసర ప్రాంతమైన శంఖవరం నుంచి ఈ గంజాయిని తక్కువ ధరకు సేకరించాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకే వ్యవసాయ యంత్రాన్ని వాడానని, దీనిని ఇతర రాష్ట్రాలకు తరలించి భారీ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని స్కెచ్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
"నిందితుడిపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్, 1985 కింద కేసు నమోదు చేశాం. ఈ గంజాయి నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశాం. ఎవరూ తప్పించుకోలేరని డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు.
పోలీస్ బాస్‌ల ప్రశంసలు
కంటికి కనపడకుండా దాచిన గంజాయిని పసిగట్టి, చాకచక్యంగా వ్యవహరించిన జగ్గంపేట సీఐ, కిర్లంపూడి ఎస్ఐ 'ఈగిల్ టీమ్' సిబ్బందిని డీఎస్పీ తిలక్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.







