UPDATED 19th SEPTEMBER 2017 TUESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు నదుల పరిరక్షణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నదుల పరిరక్షణ మనందరి బాధ్యతని, భావితరాల శ్రేయస్సు కోసం నీటిని, నీటివనరులను సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. నదులు, బావులు, కాలువలు నుంచి నీటిని తెచ్చుకునే రోజులు పోయి బాటిల్స్ తో కొనుక్కునే స్థితికి వచ్చామని, రాబోయే రోజుల్లో ఎలాంటి దుస్థితి రానున్నదో అని ఆందోళన చెందుతున్నామన్నారు. అడవులను నరికివేయడం, పంట పొలాలను పరిశ్రమలు, నివాసస్థలాలు కోసం మార్పుచేయడం వల్ల వాతావరణ కాలుష్యం, వర్షాలు లేకపోవడం ఇవన్నీ మానవుల స్వయంకృత అపరాధాలే అన్నారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని నదులు, రహదారులు వెంట అధిక సంఖ్యలో మొక్కలు పెంచాలన్నారు. ఈ విధంగా ప్రజలలో అవగాహన కల్పించడానికే ఈ ర్యాలీ ఫర్ రివర్స్ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులంతా ప్రజలకు ఈ విషయమై అవగాహన కల్పించి పెద్ద ఎత్తున మొక్కలు నాటే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో శైలజ, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







