UPDATED 3rd MAY 2017 SATURDAY 6:00 PM
పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో శుభప్రదం కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 56 గ్రామాల నుంచి 320 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిలో భాగంగా యోగా, ఆటలు, సనాతన ధర్మ పరిచయం, రామాయణ, భారత, భాగవతాలు, వ్యక్తిత్వ వికాసం, మాతృభాష, విద్య, భక్తి మొదలయిన విషయాలపై తర్ఫీదు పొందిన అధ్యాపకులచే ఏడు రోజులపాటు విద్యార్థులకు ఉచితంగా అవగాహన కల్పించనున్నారు. అనంతరం ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా సహాయ కార్యదర్శి రేపాక ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే ఆధ్యాత్మిక విలువలను నేర్పించే మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్. సురేష్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ యోగి తదితరులు పాల్గొన్నారు







