Bathukamma: 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం.. ఘనంగా వేడుకలకు సిద్ధం

UPDATED 22nd SEPTEMBER 2022 THURSDAY 11:50 AM

Bathukamma : తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఎక్కడైనా దేవతల్ని పూలతో కొలుస్తారు. కానీ, పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి బతుకమ్మలో ఉంది.అమావాస్య రోజున మొదటి బతుకమ్మ అడతారు. ఈ సారి అమావాస్య సెప్టెంబర్ 25న వస్తుంది. దీన్ని పెత్తర అమావాస్య అని కూడా అంటారు. కేవలం తెలంగాణలోనే కాదు.. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ ఆడుతారు.

ప్రతి సంవత్సరం తెలంగాణ సమాజం ఘనంగా జరుపుకొనే వేడుకలు ఇవి. ప్రతి ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి అశ్వియుజ మాసం శుద్ధ అష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఎంగిలిపూలతో మొదలై, సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజులూ తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. సిబ్బి లేదా పళ్లెంలోగాని, తాంబూలంలోగాని అడుగున ఆకులు పరిచి, తంగేడు పూలు, గునును పూలు, బంతి పూలు.. ఇలా ఈ సీజన్‌లో దొరికే పూలతో బతుకమ్మను పేరుస్తారు.

బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, తమ ముత్తయిదువ తనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు. మన సంప్రదాయంలో రకరకాల పూలతో దేవతల్ని పూజిస్తాం. కానీ, పూలనే దేవతా మూర్తిగా భావించి కొలిచే సంప్రదాయమే బతుకమ్మ. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆడవాళ్లంతా ఒక చోట చేరి, బతుకమ్మ చుట్టూ నిలిచి చప్పట్లు కొడుతూ, కోలలు వేస్తూ, పాటలు పాడుతూ, ఉత్సాహంగా బతుకమ్మ వేడు జరుపుకొంటారు. బతకుమ్మ నేపథ్యం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నా… ఇది అచ్చమెన తెలంగాణ సంస్కృతి. తెలుగువారి సంప్రదాయం కూడా. అందులోనూ మన ఆడ పడుచుల వేడుక ఇది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us