విజయవాడ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై రెక్కీ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..డీజీపీకి లేఖ రాశారు. శనివారం సాయంత్రం విజయవాడలోని వంగవీటి రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాధాపై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నా చర్యల్లేవన్నారు. ‘‘హత్యకు రెక్కీ చేసిన మాట వాస్తవమా?కాదా?. రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా? లేదా?. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు కాలయాపన చేస్తున్నారు. దోషులను కాపాడేలా ప్రభుత్వం వైఖరి ఉంది. తప్పుడు పనులు చేసేవారిని ఎప్పటికప్పుడు శిక్షించాలి. ఎవరు రెక్కీ చేశారో తెలిసి కూడా వారిని పట్టుకోకుండా, చర్యలు తీసుకోకుండా.. రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. భద్రత కల్పిస్తున్నామని చెప్పి.. అసలు దోషులను తప్పిస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఇటీవల వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా స్పందించారు. రెక్కీ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా.. సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నామని చెప్పారు.







