UPDATED 16th JUNE 2026 10:00 PM
జనం ముందే ఫోన్ చేసి క్లాస్ పీకిన ఆర్డీవో కృష్ణమూర్తి
రికార్డులతో రాకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరిక!
రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 16: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని శ్రీ కేశవ, పట్టాభి రామస్వామివారి దేవస్థానం నిధుల అవకతవకల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) కాట్నం జగన్మోహన శ్రీనివాస్ బాధ్యతారహిత్యమైన తీరుపై ఆర్డీవో పి. కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలయ నిధులు, భూముల పరిపాలనలో జరుగుతున్న అక్రమాలపై గ్రామస్తుల సమక్షంలో జరిగిన బహిరంగ విచారణకు ఈవో గైర్హాజరు కావడంపై ఆర్డీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖం చాటేసిన ఈవో.. అగ్గిమీద గుగ్గిలమైన ఆర్డీవో!
దేవస్థానం నిధుల దుర్వినియోగంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విచారణ సభకు రాకుండా ముఖం చాటేయడంపై ఆర్డీవో కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కట్టమూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ నిర్లక్ష్యమే కారణమని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. "బాధ్యత గల స్థానంలో ఉండి ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారా? సమాధానం చెప్పకుండా పారిపోతారా?" అంటూ గ్రామస్తుల మధ్యనే ఆర్డీవో నేరుగా ఈవోకు ఫోన్ చేసి క్లాస్ పీకారు. "ప్రజాధనానికి, దేవుడి సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారి విచారణకు రాకుండా దాగుడుమూతలు ఆడటం ఏంటి అని ఆర్డీవో ప్రశ్నించారు.
రికార్డులతో రాకపోతే సస్పెన్షన్ ఖాయం!
మీ పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈవోను ఆర్డీవో హెచ్చరించారు. దేవస్థానం నిధులు, భూములకు సంబంధించిన పూర్తి రికార్డులతో తక్షణమే ఆర్డీవో కార్యాలయంలో హాజరు కావాలని స్పష్టం చేశారు. విచారణకు సహకరించకపోతే శాఖాపరమైన కఠిన చర్యలతో పాటు, సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనకాడబోమని సంచలన ఆదేశాలు జారీ చేశారు.
సమగ్ర విచారణకు ఆదేశం.. సద్దుమణిగిన వివాదం
ఆలయ నిధుల దుర్వినియోగంపై ఈవో వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో పి. కృష్ణమూర్తి గ్రామస్తులకు, హిందూ సంఘాల నాయకులకు గట్టి హామీ ఇచ్చారు. ఈవోపై ఆర్డీవో తీసుకున్న కఠిన వైఖరి, ఇచ్చిన లీగల్ వార్నింగ్‌తో గ్రామస్తులు శాంతించడంతో గ్రామంలో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కాగా, ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.







