UPDATED 3rd MAY 2018 THURSDAY 6:00 PM
పెద్దాపురం: గ్రామీణ బాల్య వివాహ నిర్మూలనా కమిటీలను బలోపేతం చేసే భాద్యత సంబంధిత అధికారులపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యుడు వి. గాంధీబాబు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలనా అధికారుల సమీక్షా సమావేశం ఆర్.డి.వో వి. విశ్వేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యుడు వి. గాంధీబాబు హాజరై మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం కొన్ని ముఖ్యమైన నియమ నిబంధనలు ప్రవేశ పెట్టిందని, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.వో, మండలస్థాయిలో తహశీల్దార్లు, సి.ఎం.పి.వోలు, గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్వోలు, స్కూల్ టీచర్, అంగన్ వాడీ వర్కర్సు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీలను బలోపేతం చేయడానికి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం, డివిజన్ స్థాయి అధికారులు బలోపేతం చేయాలన్నారు. బాలల పరిరక్షణలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సీరియస్ గా ఉందని చెప్పారు. 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలికలకు వివాహం చేయరాదని, దీనిని అతిక్రమించి బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, వివాహం జరిపే పురోహితుడు, చర్చిఫాదర్, ఇమాంలు, వివాహానికి మధ్యవర్తులుగా ఉన్నవారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా బాల్య వివాహం జరిపినట్లు రెండు సంవత్సరాల వరకు ఫిర్యాదు ద్వారా తెలిసినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో బాల్య వివాహాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, మండల సమావేశంలో బాల్య వివాహం నిర్మూలన అంశాన్ని అజెండాలో మొదట ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని, బాల్య వివాహాలు నిర్మూలన ద్వారా అభివృద్ధి చెందే హక్కు ఏర్పడుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో ఎటువంటి సమస్యలు ఎదురైన ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తుందని, ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి కమీషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మానవతా దృష్టితో బాల్యవివాహాలను అరికట్టడానికి కమిటీలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి చిలకా వెంకట రామారావు, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం అధికారి సి.హెచ్. వెంకటరమణ, ఏపిడి మణమ్మ, డివిజన్ లోని సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు, తహశిల్దార్లు, ఎంపిడివోలు, సిడిపివోలు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.







