అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి సర్వం సిద్ధం

UPDATED 22nd APRIL 2018 SUNDAY 9:00 PM

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో వేంచేసి ఉన్న హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, రత్నగిరి వాసుడు, శ్రీ వీరవెంకట సత్యనారాయస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 25 నుంచి మే 1వ తేదీ వరకు వారం రోజుల పాటు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కల్యాణమహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జితేంద్ర, పెద్దాపురం ఆర్డీవో వి. విశేశ్వరరావు ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సంబంధిత వివరాలను తెలిపారు. ఈ కల్యాణోత్సవాలు ఈనెల 25న ఎదుర్కోలుతో ప్రారంభమై మే 1న శ్రీపుష్పయాగ మహోత్సవంతో ముగుస్తాయి. 25న సాయంత్రం ప్రధానాలయంలోని అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులను చేస్తారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. కళామందిరంలో జరిగే ఈ ఉత్సవంలో దేవతామూర్తుల కీర్తి ప్రతిష్టలు, గుణగణాలు, వంశాన్ని కీర్తిస్తూ సరదాగా వేడుక కార్యక్రమం జరుగుతుంది. 26న స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణమహోత్సవం రాత్రి 9 గంటలకు ప్రాంగణంలోని (రామాలయం పక్కన) కల్యాణ వేదికపై నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కల్యాణ వేదికను విశాలంగా, సుందరంగా భక్తులంతా కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో, ఆర్డీవోలు తెలిపారు. 27న రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శనం, 28న మహదాశీర్వచనం, పండిత సదస్యం, పండిత సత్కారం, (వేదశాస్త్ర సభ) తదితర కార్యక్రమాలుంటాయి. 29న సాయంత్రం వన విహారోత్సవం ఉంటుంది. ఇప్పటి వరకు కొండపై పేపర్‌మిల్లు గార్డెన్‌లో దీనిని నిర్వహించేవారు. ఈ ఏడాది కొండదిగువున గార్డెన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 30న ఉదయం పంపా సరోవరంలో శ్రీచక్రస్నానం నిర్వహించనున్నారు. మే నెల 1న శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గ్రామోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారి కల్యాణానికి పెండ్లి పెద్దలుగా సీతారాముల వారు వ్యవహరిస్తారు. 25న సీతారాముల వారిని వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగిస్తారు. 26న వధూవరులైన  సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను వెండి గరుడవాహనం, సీతారాముల వారిని పల్లకీపై ఊరేగిస్తారు. 27న నూతన వధూవరులు స్వామి, అమ్మవార్లను రావణ వాహనంపైన, 28న పొన్న వాహనంపైన, 29న వెండిరథంపై ఊరేగిస్తారు. కల్యాణ మహోత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేయనున్నారు. అలాగే  భజనలు, సంగీత కచేరీలు, భక్తి ప్రవచనాలు, కూచిపూడి నృత్యాలు, వీణా వాయిద్య కచేరీ, బుర్రకథ, హరికథ, ఈలపాట, కర్ణాటక సంగీతం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు, ఈఈ నూకరత్నం, పీఆర్వో తులా రాముడు, ఏఈవోలు వైఎస్‌ఆర్‌ మూర్తి, ఎం.కె.టి.ఎన్‌.వి. ప్రసాద్‌, నటరాజ్‌, సి.హెచ్‌ రామ్మోహనరావు, సూపరింటెండెంట్లు బలువు వాసు, శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us