UPDATED 26th JANUARY 2018 FRIDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందేమాతర గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో ఆదిత్యా విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా, దేశ అభివృద్ధిలో నీ పాత్ర ఏమిటి అని ప్రతీ ఒక్కరూ ప్రశ్నించుకోవాలన్నారు. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి భారతదేశం సర్వ సత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలను సమర్ధవంతంగా నిర్వహించడమే మనం దేశానికి చేసే సేవగా ఆయన అభివర్ణించారు. ఈ వేడుకలలో బిపిడి విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ శరభోజి, డాక్టర్ మోహన్, జి. రామకృష్ణ, ఎస్.టి.వి.ఎస్. కుమార్, సిఎవో పి. కృష్ణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర, హాస్టల్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.







