UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 11:15 AM
అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన్ను డీజీపీ హోదా నుంచి ఏపీ సర్కార్ బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పదవిలో గౌతమ్ సవాంగ్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
రిటైర్డు అయినా పదవిలో ఆయన కొనసాగనున్నారు. బదిలీ చేసిన వెంటనే గౌతమ్ సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ కేటాయించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఏపీపీఎస్సీ చైర్మన్ నియమిస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత కొంతకాలంగా ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు గౌతమ్ సవాంగ్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు ఆయనకు సర్వీసు ఉంది. అయినప్పటికీ ఆయన బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని సవాంగ్ ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు.
2001-2003 సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు. 2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా సవాంగ్ పనిచేశారు. 2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్ డీఐజీగా, 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. గతేడాది జులై నుంచి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ సవాంగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగించారు.ఏపీ డీజీపీ పోస్టు నుంచి బదిలీ అయిన సవాంగ్ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి పూర్తి స్థాయిలో డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్‌గానూ పనిచేశారు.
హైదరాబాద్‌లో డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా పనిచేసిన రాజేంద్రనాథ్.. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.







