UPDATED 21st OCTOBER 2018 SUNDAY 9:00 PM
పెద్దాపురం : పెద్దాపురం పట్టణంలోని స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్ జిల్లా రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. మెన్ సింగిల్స్ విభాగంలో ఎం. కలవినన్ (కృష్ణా) ప్రథమస్థానం, ఎ. జగదీష్ కృష్ణ (గుంటూరు) ద్వితీయ స్ధానం, ఉమెన్ సింగిల్స్ విభాగంలో సైల్ నూర్‌బాషా (కృష్ణా) ప్రథమ స్ధానం, టి.ఎల్. హర్షిత (తూర్పుగోదావరి) ద్వితీయ స్థానం సాధించారు. యూత్ బాయ్స్ సింగిల్స్ విభాగంలో కె. పవన్ కుమార్ (కృష్ణా) ప్రథమ, ఆర్. సాయిస్వరూప్ (విశాఖ) ద్వితీయ స్థానాలు సాధించారు. యూత్ గర్ల్స్ సింగిల్స్ విభాగంలో సైల్ నూర్ బాషా (కృష్ణా) ప్రథమ స్థానం, ఆర్. కాజోల్ (కృష్ణా) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాయ్స్ సింగిల్స్ విభాగంలో ఎ. సాయిదీపక్ (తూర్పుగోదావరి) ప్రథమ, సి.హెచ్. నితీష్ వర్మ (తూర్పుగోదావరి) ద్వితీయ స్థానాలు సాధించారు. జూనియర్ గర్ల్స్ సింగిల్స్ విభాగంలో ఆర్. కాజోల్ (కృష్ణా) ప్రథమ స్థానం, ఎస్. మమతా చౌదరి (కృష్ణా) ద్వితీయ స్థానాలు సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ సింగిల్స్‌లో టి. సూర్యతేజ (తూర్పుగోదావరి) ప్రథమ స్థానం, సిహెచ్. దత్త అవినాష్ (విశాఖ) ద్వితీయ స్థానం సాధించారు. సబ్ జూనియర్ గర్ల్స్ సింగిల్స్‌లో పి. చార్వి (తూర్పుగోదావరి) ప్రథమ, ఎం. దీప్తి (తూర్పుగోదావరి) ద్వితీయ స్థానాలు సాధించారు. క్యాడెట్ బాయ్స్ సింగిల్స్‌లో ఎ. శ్రీ కౌషిక్ (తూర్పుగోదావరి) ప్రథమ స్థానం, పి. మహేంద్రవర్మ (విశాఖ) ద్వితీయ స్థానం సాధించారు. క్యాడెట్ గర్ల్స్ విభాగంలో ఎన్. దోహదవతి (కృష్ణా) ప్రథమ స్థానం, జి. శ్రీపావని (తూర్పుగోదావరి) ద్వితీయ స్థానం సాధించారు. అనంతరం జరిగిన ముగింపు సభలో విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా ఎనిమిది సార్లు నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ సాధించి అర్జున అవార్డు పొందిన కోచ్, స్పోర్ట్ డైరెక్టర్ కమలేష్ మెహతా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలివితేటలతో కూడిన కృషి నైపుణ్యంతో అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నారని, కృషి పట్టుదల ఉంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చన్నారు. విద్యార్ధులను క్రీడారంగంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. శ్రీ ప్రకాష్ సినర్జీ టేబుల్ టెన్నిస్ అకాడమీలో సౌకర్యాలు క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అకాడమీ కార్యదర్శి ఎస్‌ఎం. సుల్తాన్, మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ అకాడమీని అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దిన తీరు అమోఘమని భవిష్యత్తులో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఈ అకాడమీ వేదిక కావాలని ఆకాంక్షించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్ధల డైరెక్టర్ చిట్టూరి విజయప్రకాష్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు అంతా చక్కని క్రీడాస్ఫూర్తి ప్రదర్శించారని, వీరంతా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయాలని అన్నారు. ఈ సందర్భంగా టేబుల్ టెన్నిస్ క్రీడలో ప్రఖ్యాతి చెందిన డిఎస్‌ఆర్ కుమార్, కోకా సూర్యనారాయణ రావు, జి. సీతారామస్వామి, పి. వేణుగోపాలరావు, ఎం. అచ్యుత కుమార్, రాయన్ రావులను ఘనంగా పూలమాలలు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్ష, కార్యదర్శులు రావు చిన్నారావు, కె. మోహన్ బాబు, పి. విశ్వనాధ్, రావు ప్రభాకరరావు, లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్.రావు, వైస్ ప్రిన్సిపాల్ కె. నీరాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







