UPDATED 8th NOVEMBER 2022 TUESDAY 07:10 PM
Annavaram : రత్నగిరివాసుడైన సత్యదేవుడు కొలువుదీరిన రత్న,సత్యగిరులు మంగళవారం సత్యదేవనామస్మరణతో మార్మోగి అడుగడుగునా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ప్రతీఏటా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ఈవో సత్యనారాయణమూర్తి, చైర్మన్ ఐవీ రోహిత్ తొలిపావంచా వద్ద టెంకాయి కొట్టి గిరియాత్రను ప్రారంభించారు. స్వామి,అమ్మవార్లను పల్లకిబోయలు పల్లకిలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు నడుమ రెండుకొండల చుట్టూ విహరింపచేశారు.
ముందు స్వామివారి ప్రచార రథాన్ని సర్వాంగసుందరంగా సుగందభరిత పుష్పాలతో అలంకరింపచేశారు. సుమారు 11.5 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ యాత్ర జరిగింది. గడిచిన మూడేళ్లగా కరోనా ప్రభావంతో నిలిచిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు లక్షమంది భక్తులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. చందగ్రహణం సందర్భంగా కార్యక్రమాన్ని వేగంగా ముగించారు.
స్వామివారి పల్లకీని పలు ప్రాంతాల్లో ఉంచి పూజలు జరిపి యాత్రను సుమారు 5 గంటల పాటు కొనసాగించారు. పలుచోట్ల దాతల సహకారంతో పండ్ల స్టాల్స్, మజ్జిగ వితరణ, పాలు పంపిణీ చేపట్టారు. ముఖ్య కూడళ్లలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గిరిప్రదక్షిణ పూర్తయిన అనంతరం స్వామి,అమ్మవార్లను పంపాతీరం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించి పండితులు పూజలు నిర్వహించారు.
తీర్థప్రసాదాలు అందజేసి స్వామి,అమ్మవార్లను తిరిగి ప్రధానాలయానికి తీసుకెళ్లారు. 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.







