UPDATED 19th JULY 2017 WEDNESDAY 7:00 PM
గండేపల్లి: రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థలో ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కొత్త కోర్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర భవిష్యత్తులో ఎంతో కీలకంగా మారుతుందని, అభివృద్ధి చెందుతున్న నేటి విద్యావిధానంలో కంప్యూటర్ సైన్స్ తో పాటు ఈ ఫోరెన్సిక్ కోర్స్ ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. నేరాల నిర్ధారణకు ఈ కోర్స్ పోలీస్ వ్యవస్థకు ఎంతో ముఖ్యమని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కొత్త కోర్స్ ను ఇక్కడ ప్రారంభించడం నిజంగా గర్వకారణం అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం. ముత్యాలనాయుడు మాట్లాడుతూ విద్యారంగంలో మూడు దశాబ్దాలకు పైబడి సేవలందిస్తున్న ఆదిత్య విద్యా సంస్థలు ద్వారా కొత్త కోర్స్ ను నన్నయ యూనివర్సిటీ ద్వారా ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యావిధానంలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను అవలంభిస్తూ కేజీ నుంచి పీజీ వరకు వివిధ కోర్సులు అందిస్తున్నఆదిత్య తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి కోర్స్ ను తీసుకురావడం గొప్ప విషయం అని కొనియాడారు. కళాశాల చైర్మన్, వైస్ చైర్మన్ నల్లమిల్లి శేషా రెడ్డి, సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులకు వారు కృతజ్ఞతలు తెలియచేసారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ ఎం. సుగుణా రెడ్డి అతిధులను మెమెంటోలతో ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







