ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చెంబోలు సీతారామశాస్ర్తి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డాక్టర్‌. సి.వి.యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్‌, ఆంధ్రా విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతతో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమండ్రిలో కొంతకాలం పనిచేశారు. ఆయనలో ఓ కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్ర్తికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించినా అందుకు తాను సూటబుల్‌ కాదని అటువైపు వెళ్లలేదు. కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం చేసే ఆయన్ను గమనించిన సోదరుడు అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. నువ్వు ఒకసారి ప్రయత్నించు అని చెప్పడంతో ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్తుండేవారు. ఆ సమయంలో సీతారామశాస్ర్తిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చదువుతున్న సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో సిరివెన్నెల చిత్రానికి తొలిసారి పాటలు రాశారు. అక్కడి నుంచి ఆయన జీవితం పద్మశ్రీ ఎందుకునే స్థాయికి వెళ్లింది.  జనాల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నో రాశారాయన.  సీతారామశాస్ర్తి పాటలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అదే స్థాయిలో అవార్డులు కూడా ఆయన చెంతకు చేరాయి. తొలి గీతం సిరివెన్నెలలోని విధాత తలపున కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత ఆయనది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనకు పదమూడు సార్లు నంది అవార్డ్‌ వరించింది. ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us