UPDATED 27th MAY 2017 SATURDAY 6:00 PM
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ మహానాడు తొలిరోజు సభ సక్సెస్ అయినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేతకు అందరి పనితీరు తెలుసని, పనిచేయని గాడితప్పిన నాయకులను వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధ్యక్ష్యుడు కట్ చేయడం ఖాయం అని అన్నారు. పదవి వచ్చాకా ఇంకా పెద్ద పదవి కావాలని కొందరు ప్రయత్నించడం సరైంది కాదని చినరాజప్ప పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ. లక్షా 75 వేల కోట్లు ఇచ్చామన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పింది నిజమే అని చినరాజప్ప తెలిపారు. అభివృద్ధిలో భాగంగానే నిధులిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. వైసీపీ, సీపిఐ పార్టీలకు అభివృద్ధి ఇష్టం లేదని విమర్శించారు. ముద్రగడకు నెలకొకసారి కాపులు గుర్తుకొస్తారని, కాపులకు ముద్రగడ ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కాపులకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, కార్యకర్తగా ఎలా ఉంటారో పదవులు వచ్చాక అలాగే ఉండాలని చినరాజప్ప పేర్కొన్నారు.







