UPDATED 30th APRIL 2018 MONDAY 9:00 PM
రంపచోడవరం: గిరిజనులకు కులదృవీకరణ పత్రం జారీ ద్వారా వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తున్నామని, ఇంతవరకు డివిజన్ పరిధిలో 10వేల మంది గిరిజనులకు కులధృవీకరణ పత్రాలు గ్రామసభలు ద్వారా జారీచేసి గతంలో ఎన్నడూలేని విధంగా నూతన ఒరవడికి నాంది పలకడం జరిగిందని సబ్-కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో సుమారు 50 మంది హాజరై తమ సమస్యలను వ్రాతపూర్వకంగా సబ్-కలెక్టరు, ఎపిఒ పి.వి.ఎస్ నాయుడులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ రాయితీలు పొందడంలో గిరిజనులు ఇబ్బందులను స్వయంగా గుర్తించామని, ఈ సమస్యలు పరిష్కారానికై ఇటీవల డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో ఫాస్ట్ ట్రాక్ విధానంలో కులదృవీకరణ పత్రం-భవిష్యత్తు భద్రం పేరిట గ్రామసభల నిర్వహణ ద్వారా చేపట్టిన కులధ్రువీకరణ జారీప్రక్రియవల్ల గిరిజనుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. అలాగే రెవిన్యూ, గిరిజన సంక్షేమశాఖ, విద్య, పంచాయితీశాఖల సమన్వయంతో చేపట్టిన కుల ధ్రువీకరణ గ్రామసభలు విజయవంతంగా నిర్వహించిన అధికారులను సిబ్బందిని ఆయన అభినందించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాలకు చెందిన తహసీల్దార్లు గిరిజనులు మన్ననలు పొందారని, అలాగే వీరికి గిరిజనులు సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించారన్నారు. గిరిజనులు విద్య, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ రాయితీలు పొందడంలో కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాలు స్థానిక గ్రామ పంచాయితీలలో నేరుగా గ్రామసభలు నిర్వహించి అందచేయడం వల్ల గిరిజన వర్గాల నుంచి ఆనందం వ్యక్తం అవుతోందన్నారు. అడ్డతీగల గ్రామంలో అనాధ ఆడపిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం చిల్డ్రన్ హోం ఏర్పాటు చేశారని, అనాధ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే 9394079427 నెంబరులో సంప్రదించాలన్నారు. ప్రతి గ్రామపంచాయితీకి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఐదు సెంట్లు విస్తీర్ణం మేర స్థలాలను కేటాయించాలని, ఈ కేంద్రాలు ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తహసీల్దార్లను, డివిజనల్ పంచాయితీ అధికారిణి జి. రాజ్యలక్ష్మిని ఆదేశించారు. వివిధ రోడ్లు తదితర నిర్మాణ పనులలో ఉత్పన్నమైన అటవీ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాల అధిపతులను ఆదేశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 క్రింద గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ అటవీ హక్కుల కమిటీలో ఖాళీగా వున్న సభ్యులను నియమించాలని, అలాగే పీసా గ్రామసభలు నిర్వహణకు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇ.ఇ పి.కె. నాగేశ్వరరావు, ఉపసంచాలకులు ఎం. సరస్వతి, పి.హెచ్.వో వై. సత్యనారాయణ, ఎపిడిలు వై. సత్యం నాయుడు, లక్ష్మయ్యబాబు, హౌసింగ్ ఇఇ ఎం. రవిశంకర్, ఎడిఇ ట్రాన్సుకో వై.వి. లక్ష్మీనారాయణ, జి.సి.సి డిఎం రాజన్ రాజు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పంచాయితీరాజ్, ఆర్& బి, గిరిజన సంక్షేమశాఖ డి.ఇలు టి.వి.ఎస్. రాంప్రసాద్, పద్మనాభం, సత్యనారాయణ, పిఎస్.వి. లక్ష్మి, వేణుగోపాల్, అదనపు డి.ఎం.హెచ్.వో కె. అప్పారావు, ఎంపిడివో బి. సరస్వతి, తహసీల్దార్ పి. రామోజి, వ్యవసాయశాఖ ఎడిలు డి..శ్రీనివాసరెడ్డి, రాబర్ట్ పాల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







