డి.ఎం.హెచ్.వోను ఆదేశించిన జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా
UPDATED 28th MAY 2018 MONDAY 7:00 PM
కాకినాడ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని డి.ఎం.హెచ్.వోను జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ. మల్లిఖార్జునతో కలిసి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ మీకోసం ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో చర్యలు చేపట్టాలని, విజ్ఞాపనలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయడం జరుగుతుందని, వాటిపై చేపట్టిన చర్యలను ఎటిఆర్ రూపంలో వెంటనే తెలియజేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే సమస్యలు 35 శాతం జిల్లా పంచాయతీ అధికారికి సంబంధించినవని , ఈ సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలని కలక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన మాక సుశీల తనకు 83 శాతం అంగవైకల్యం ఉందని, దీని మూలంగా తల్లిదండ్రులకు భారంగా ఉన్నానని, యస్.సి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం రుణ సహాయం చేయాలని కలక్టర్ ను కోరగా, దీనిపై కలక్టర్ స్పందిస్తూ వెంటనే ఆమెకు రుణ సౌకర్యం కల్పించాలని యస్.సి కార్పొరేషన్ ఇడిని ఆదేశించారు. కాకినాడ కొండయ్యపాలెంకు చెందిన జి. భాస్కరమ్మ అనాధగా ఉన్న తన ఆరి సంవత్సరాల మనవరాలిని ఆదుకోవాలని కలక్టర్ ను కోరగా ఈమెకు ఆశ్రయం కల్పించాలని బిసి సంక్షేమశాఖ అధికారులకు సూచించారు. మీకోసం ప్రజావాణిలో భాగంగా గతంలో వివిధ సమస్యల పరిష్కారంపై అర్జీలు సమర్పించామని, దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని కలక్టర్ ను కోరగా సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేస్తూ ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలక్టర్ ఆదేశించారు. సోమవారంనాడు జరిగిన ప్రజావాణిలో పలువురు తమ భూములను ఆన్ లైన్ ద్వారా వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా నిర్మించిన మరుగుదొడ్లకు బకాయిలు చెల్లించాలని, అలాగే వివిధ పథకాల ద్వారా స్వయం ఉపాధి పనులకు రుణసౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను కోరారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో నిర్మించిన కళ్యాణ మండపం డ్రైన్లు మూలంగా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు చర్యలు కోరగా, దీనిపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. మీకోసం ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల వద్దకే నేరుగా వెళ్ళి కలక్టర్ వారి సమస్యలను తెలుసుకున్నారు. రాయవరం మండలం చెల్లూరులో మురుగునీరు ఇరిగేషన్ కాలువలో కలుస్తుందని, దీని మూలంగా నీరు కలుషితం అవుతున్నందువలన తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరగా దీనిపై కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలన జాయింట్ కలెక్టర్ కు సూచించారు. అంబాజీపేట మండలం పోతారులంకలో శ్మశానవాటిక గ్రౌండ్ వర్షాకాలంలో మునిగిపోతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని త్వరగా ఈ ముంపు నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్ఐఎస్ సుబ్బలక్ష్మి, డీఆర్డీఏ పిడి ఎస్. మల్లిబాబు, డ్వామా పిడి జి. రాజకుమారి, బిసి కార్పోరేషన్ ఇడి ఎం. జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







