UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: మహిళా సంఘాలు ప్రగతిపై దృష్టి సాధించాలని, వెలుగు డి.ఆర్.డి.ఎ. సిబ్బంది పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ముఖ్య కార్యనిర్వహణాధికారి కృష్ణమోహన్ అన్నారు. స్థానిక టిటిడిసిలో వెలుగు, డి.ఆర్.డి.ఎ సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం మాట్లాడారు. మహిళా సంఘాల ప్రగతికి వెలుగు సిబ్బంది పాటుపడవలసి ఉందన్నారు. అవసరమైన మేరకు వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము మహిళా సంఘాలకు చేరాలని సూచించారు. బ్యాంకు నుంచి సొమ్ములు తీసుకుని వారి సొంత అవసరాలకు ఖర్చు చేసుకోవడం వలన ప్రగతి సాధ్యం కావడం లేదన్నారు. ఇకపై వెలుగు డి.ఆర్.డి.ఎ. సిబ్బంది మహిళా సంఘాల ప్రగతిపై శ్రద్ధ చూపాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్త్రీనిధి ఎండి రమేష్ బాబు మాట్లాడుతూ మహిళా సంఘాలతో స్త్రీ నిధి బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ బ్యాంకు నుంచి అప్పులు వేగంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజ్ ప్రాజెక్టు అధికారి పి.కె. కుమార్, ఐపీడిపి ఎండి రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.







