UPDATED 21st JUNE 2026 6:00 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 21 : యోగా అంటే శరీరాన్ని, మనస్సును ఒక క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియ. కానీ, పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మాత్రం యోగాకు ఒక సరికొత్త ‘నిర్వచనం’ ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిబ్బంది ప్రదర్శించిన ‘ఆసనాలు’ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ, నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి.
శిక్షణ ఇస్తున్నారా? నవ్వులు పూయిస్తున్నారా?
వైరల్ అవుతున్న వీడియో దృశ్యాలను చూస్తే.. అది యోగా క్లాసా లేక హాయిగా కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకునే ‘రిలాక్సేషన్ క్లబ్’ ఆ అనే అనుమానం రాక మానదు. ఇన్స్ట్రక్టర్ మైక్‌లో "కాళ్లు సమాంతరంగా ఉంచండి.. తల, కాళ్లు ఒకే ఎత్తులో ఉండాలి" అని ఎంత నెత్తీ నోరూ బాదుకుంటున్నా, అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం తమకు నచ్చిన శైలిలో ‘యోగా’ కానిచ్చేశారు.
స్థానికుల సెటైర్లు: ఈ దృశ్యాలు చూసిన స్థానికులు.. "ఇది యోగాసనంలా లేదు బాబోయ్.. ఆఫీస్ అలసట పోగొట్టుకోవడానికి హాయిగా ఒళ్లు సాగదీస్తూ విశ్రాంతి పొందుతున్నట్లు ఉంది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
నియమాలకు విరుద్ధంగా..
నిజానికి యోగా అనేది పూర్తి ఏకాగ్రతతో, ప్రశాంతమైన చిత్తంతో చేయాల్సిన ప్రక్రియ. కానీ ఇక్కడ మాత్రం సీరియస్‌నెస్ అనేది అస్సలు కనిపించలేదు. ఇన్స్ట్రక్టర్ సూచనలను అస్సలు పట్టించుకోకుండా, ఎవరికి తోచినట్లు వారు కాళ్లు, చేతులు ఆడిస్తూ.. యోగాను కాస్త ‘జోగా’గా మార్చేశారు. ఏదేమైనా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత గల కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కనీస క్రమశిక్షణ పాటించకపోతే, అది యోగా యొక్క మూల ఆశయాలకే విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- స్మైల్ ప్లీజ్: ముందు వరుసలో ఉన్న కొందరు మహిళా సిబ్బంది ఆసనం వేస్తూనే, కెమెరా వైపు చూస్తూ విరగబడి నవ్వుతూ పోజులు ఇవ్వడం గమనార్హం.
- నా ఇష్టం.. నా స్టైల్: కొందరైతే కాళ్లు పైకెత్తి మరీ పక్కన వాళ్లతో హాయిగా ముచ్చట్లు పెడుతున్నారు. మరికొందరు ఒకరి కాళ్లు ఇంకొకరికి తగలకుండా ఉండేందుకు ‘క్రాస్’గా తిరిగి పడుకుని, యోగా నియమ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు.







