UPDATED 28th AUGUST 2017 MONDAY 1:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించే రాష్ట్రస్థాయి టెక్ ఫెస్ట్ "పోలీ వేద 2కె-17" పోస్టర్ ను ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి విద్యార్థులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యం లేనిదే వేద కార్యక్రమం లేదని, వినూత్నంగా విద్యార్థులచే ఈ పోస్టర్ ను విడుదల చేయడం సముచితమని భావించి వారితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రస్థాయి టెక్ ఫెస్ట్ "పోలీ వేద 2కె-17" విద్యార్థుల్లో దాగి ఉన్న నూతన ఆవిష్కరణలకు ఆలోచనలకు అద్దంపట్టే వేదికగా నిలుస్తుందన్నారు. వచ్చేనెల సెప్టెంబర్ 15, 16 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ టెక్ ఫెస్ట్ వేడుకలో విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించి నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి పలు కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతీ విభాగాన్ని సమర్ధవంతంగా సక్రమంగా నిర్వహించేందుకు కమిటీలను వేయడం జరిగిందన్నారు. తమ కళాశాలలో వివిధ బ్రాంచ్ లకు ప్రాధాన్యం కల్పిస్తూ ఆయా బ్రాంచ్ లలో పేపర్, పోస్టర్, ప్రాజెక్ట్ ప్రెజంటేషన్ తదితర అంశాలతో కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని కళాశాలలకు పోస్ట్ ద్వారా ఈ పోస్టర్ ను పంపిస్తామని, మరిన్ని వివరాలకు www.politechnic.aec.edu.in /veda వెబ్ సైట్ లో చూడవచ్చన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.వి.మాధవరావు మాట్లాడుతూ వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులకు నగదు పురస్కారంతో జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించడం జరుగుతుందన్నారు. కళాశాల యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్ ఈ కార్యక్రమంలో తమ విద్యార్థులను ప్రాతినిధ్యం వహించేలా సహకరించాలని కోరారు.







