UPDATED 4th JUNE 2022 SATURDAY 08:40 PM
Pawan Kalyan Three Options : పొత్తులు, సీఎం అభ్యర్థి, ప్రభుత్వ ఏర్పాటుపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో, 2019లో తగ్గామన్న పవన్.. 2024లో తగ్గేదే లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కూడా బైబిల్ సూక్తిని పాటించాలని, తనకు తాను తగ్గించుకోవాలని పవన్ సూచించారు. ఈసారి తాము తగ్గేదేలేదన్నారు పవన్ కల్యాణ్.
ఈసారి ప్రజలు గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. పోరాడితే పోయేదేమీలేదు, బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు పవన్.”రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గా. గత అన్ని సార్లు తగ్గాల్సిన వరకు తగ్గా. 2014లో తగ్గాం. 2019లోనూ తగ్గాం. 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము” అని పవన్ తేల్చి చెప్పారు. అన్నిసార్లు తగ్గాం.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని నా కోరిక అని పవన్ అన్నారు.
ఇక సీఎం అభ్యర్థి పైనా పవన్ స్పందించారు. నేనే సీఎం అభ్యర్థిని అని నాకు స్వయంగా బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ చెప్పలేదు. మీడియాలో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడను. నువ్వే సీఎం అభ్యర్థివి అని.. బీజేపీ అగ్రనాయకత్వం చెబితే అప్పుడు నేను మీకు తెలియజేస్తా.ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై పవన్ మూడు ఆప్షన్లతో ముందుకొచ్చారు. ”పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి. పదవి లేకపోతే మనం ఆగిపోము.
పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం. పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు, అధికారం ఉంటుంది. మన ముందే మూడే సాధ్యాలు ఉన్నాయి. బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపన చేయడం. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. లేదా జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ మూడు ఆప్షన్లే ఉన్నాయి. నేను అన్నింటికీ సిద్ధం” అంటూ పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.







