UPDATED 2nd MAY 2018 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాల్లో భాగంగా బుధవారం హాట్ ఎయిర్ బెలూన్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ శిబిరానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 140 మంది విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండు, మూడు తేదీలలో హాట్ ఎయిర్ బెలూన్ విన్యాసాలు ప్రారంభించామని, పాఠశాల స్థాయిలో మొదటిసారిగా ఈ హాట్ ఎయిర్ బెలూన్ విన్యాసాలు పెద్దాపురంలో జరుగుతున్నాయని, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయోగాలకు జైపూర్ రారాజుగా పేర్కొంటారని తెలిపారు. అమెరికాలో శిక్షణ పొంది జైపూర్ లో గల సైవాజ్ కంపెనీకి చెందిన నితేష్ పారిక్ పైలట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ పాఠశాల ఈ తరహా విన్యాసాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సాహసకృత్యాలపై ఆశక్తిని పెంపొందించి అపాయకర విపత్తులను సాహాసోపేతంతో ఎదుర్కొనే విధానాలు గురించి తెలుసుకోవచ్చని, ఈ తరహా శిక్షణ ద్వారా దేశ, విదేశాలలో ఎన్నో ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు. అలాగే దీనిపై అధ్యయన శిక్షణా తరగతులను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ యమ్.వి.యస్.యస్. మూర్తి, సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్.రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







