Mohanlal: అందుకే ఈ చిత్రం తెరకెక్కడానికి 20ఏళ్లు పట్టింది: మోహన్‌లాల్

రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘మ‌ర‌క్కార్‌- అరేబియా స‌ముద్ర సింహం’. మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 16వ శ‌తాబ్ద‌పు చరిత్రాత్మక పాత్ర అయిన కుంజ‌లి మ‌ర‌క్కార్ ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. ఆ పాత్రలో నటించాలని మోహన్‌లాల్‌ రెండు దశాబ్దాల కిందటే భావించారట. ఎట్టకేలకు ‘మరక్కార్‌’ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. అయితే, ఈ చిత్రం తెరకెక్కడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందో తాజాగా మోహన్‌లాల్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఇది చాలా పెద్ద సినిమా. దీన్ని ఆ రోజుల్లో తెరకెక్కించడం అంత సులువు కాదు. మరక్కార్‌ చిత్రమంతా సముద్రంతో ముడిపడి ఉంది. సముద్రంపైనే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాలి. అది అప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. నేను నటించిన ‘కాలాపానీ’ చిత్రం కోసం కూడా చాలా కష్టపడ్డాం. వీఎఫ్‌ఎక్స్‌ చేయించుకోవడం కోసం హాంకాంగ్‌ వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ మొత్తం ఇక్కడే చేయగలుగుతున్నాం. ‘మరక్కార్‌..’ చిత్రంలో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కోసమే ఏడాది పాటు పనిచేశాం. ప్రతిదానికి ఓ సమయం అంటూ వస్తుంది. ఇప్పుడు ఇది ‘మరక్కార్‌’సమయం’’అని మోహన్‌లాల్‌ చెప్పుకొచ్చారు. మరక్కార్‌ చిత్రంలో పాత్రల కోసం పెద్దగా ఇబ్బంది పడలేదని.. పాత్రల కాస్ట్యూమ్‌ కోసం చాలా కష్టపడ్డామని మోహన్‌లాల్‌ అన్నారు. దర్శకుడు ప్రియదర్శన్‌తో తను ఇప్పటి వరకు 46 చిత్రాలు చేసినట్లు చెప్పారు. దీంతో మరక్కార్‌ చిత్రీకరణ అంతా ఒక విహారయాత్రగా సాగిందని తెలిపారు. డిసెంబర్‌ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. డిసెంబరు 17వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us