ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 31 ఆక్టోబర్ 2021: గజారోహణంతో గోవిందుడు భక్తకోటికి కనువిందు చేశాడు. ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే ఏనుగును వాహనంగా మలచుకున్న శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాడపల్లి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం గజవాహనసేవ భక్తుల మంగళహారతుల మధ్య వైభవంగా సాగింది. శ్రీవారు రాజాధిరాజ అలంకరణలో భక్తులను కటాక్షించారు. అరుణ కిరణాలు ప్రసరిస్తుండగా దివ్యకాంతులీనుతున్న గజవాహన సేవ ఉత్సవాన్ని చూసిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. అంతకముందు శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.







