UPDATED 22nd JULY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో కాంట్రాక్టు, టెండర్, ఎన్ఎంఆర్ పద్దతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న బిల్ కలెక్టరు, గుమాస్తా, అటెండరు, శానిటరీ, మేస్త్రీ పోస్టులను క్వాలిఫై అయిన వారితోనే భర్తీ చేయాలనీ, ప్రతీ కార్మికుడికి పిఎఫ్, ఇఎస్ఐ వర్తించే విధంగా 2011లో ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చినప్పటికీ నేటికీ ఒక్క కార్మికుడికి కూడా అవి వర్తించే విధంగా ఏర్పాటు చేయలేదని, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుకు చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు రెండు నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంచాయతీ కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం. వెంకటేశ్వరరావు, యన్. సింహాద్రి, వై. శివశంకర్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







